తిరుపతి మంగళం : జిల్లాలో మోటారు వాహనాల చట్టం అమలు, రహదారి భద్రత పరిరక్షణ, పన్నుల వసూలుకు జిల్లా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపడుతోది. ఇందులో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు ఆదివారం రవాణా శాఖ అధికారులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కాంట్రాక్ట్ క్యారేజ్, టూరిస్ట్ బస్సులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతి నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న నాగాలాండ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు పత్రాలు పరిశీలించారు. ఆల్ ఇండియా పర్మిట్ పన్ను చెల్లించకుండా ప్రయాణికులను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.3.60 లక్షల జరిమానా విధించారు. అదేవిధంగా హైదరాబాదు నుంచి తిరుపతికి వస్తున్న మరో టూరిస్ట్ బస్సుకు కూడా పన్నులు చెల్లించకుండా నడుపుతున్నట్లు గుర్తించారు. దానికి రూ.70 వేలు జరిమానా విధించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ పన్నులు చెల్లించకుండా నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడానికి తనిఖీలను ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. పట్టుబడిన రెండు వాహనాలకు రూ.4,30 లక్షల జరిమానా విధించినట్టు చెప్పారు. ఈ తనిఖీల్లో మోటారు వాహనాల తనిఖీ అధికారులు అతికా నాజ్, ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు.


