వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం పద్మావతీ, ఆండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. ఆలయ పండిత బృందం ముందుగా గణపతి హోమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ మాంగల్య ధారణ కమనీయంగా నిర్వహించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


