చంద్రగిరి: మాంస ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ ద్వారా రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఎస్వీ వెటర్నరీ వీసీ డాక్టర్ జేవీ రమణ అన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, నిరుద్యోగ యువతకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఐసీఏఆర్– నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (డీఏపీఎస్‌సీ) పథకం కింద ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్నారు. వెటర్నరీ సైన్స్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతిరామయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి వీసీ జేవీ.రమణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ శోభామణి, సైన్స్ డీన్ సురేష్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ జేవీ రమణ మాట్లాడుతూ పశుసంవర్థక రంగం గ్రామీణ యువత ఆర్థికాభివృద్ధికి గొప్ప అవకాశాలను కలిగి ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు పశుసంవర్థక, పౌల్ట్రీ రంగాలు జీవనోపాధి భద్రత, పోషకాహార మద్దతు, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ శోభామణి మాట్లాడుతూ మాంస ఉత్పత్తుల్లో సాసేజ్‌లు, నగెట్స్, ప్యాటీస్, పికిల్స్, కబాబ్, రెడీ–టు–కుక్ లేదా రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చగలవని తెలిపారు. వెటర్నరీ సైన్స్ డీన్ సురేష్ కుమార్ మాట్లాడుతూ విలువ ఆధారిత మాంస ఉత్పత్తులు ముడి పదార్థాల నిల్వ కాలాన్ని పెంచడమే కాకుండా ఉత్పత్తుల విభిన్నతను, మార్కెట్ అవకాశాలను కూడా మెరుగుపరుస్తాయని తెలిపారు. వెటర్నరీ సైన్స్ కళాశాల అసోసియేట్ డీన్ జగపతిరామయ్య మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణ మాంస ప్రాసెసింగ్ సాంకేతికత, పారిశ్రామిక అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించేలా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైవ్‌స్టాక్ ప్రొడక్టస్ టెక్నాలజీ విభాగాధిపతి విజయ భాస్కర్ రెడ్డి, పలువురు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.


