పీజీఆర్‌ఎస్‌లో..అర్జీల రచ్చ
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అవసరమైన మేరకు ప్రింటింగ్ అర్జీలు లేకపోవడంతో రచ్చరచ్చగా మారింది. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 644 అర్జీలు వచ్చాయి. ఒక్కో అర్జీకి 5 నుంచి 10 మంది రావడంతో కలెక్టరేట్ 3 వేల నుంచి 6 వేల మందితో నిండిపోయింది. అర్జీదారులకు అధికారులు ఇచ్చే ప్రింటింగ్ పేపర్ అర్జీలను అవసరం మేరకు ఉంచకపోవడంతో అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు.
పార్టీ కండువా వేసుకుంటే క్యూ అవసరం లేదు
అధికారపార్టీకి చెందిన పలువురు తమ పార్టీకి చెందిన కండువాను మెడలో వేసుకుని క్యూలో కాకుండా నేరుగా పీజీఆర్‌ఎస్ చాంబర్‌లోనికి గుంపులు గుంపులుగా వెళ్లి, అధికారులను కలసి అర్జీలను అందజేశారు. కొందరు ఏ పార్టీతో సంబంధం లేకున్న.. జేబులో కండువాను మెడలో వేసుకుని క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లి, అర్జీ ఇచ్చిన తర్వాత జేబులో పెట్టుకుని వెళ్లిపోయారు. క్యూలో గంటల కొద్ది వేచి ఉన్న వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు నానా తిప్పులు పడ్డారు. ఒక దశలో క్యూలో ఉన్న అర్జీదారులు అరుపులు కేకలు వేయడంతోపాటు పీజీఆర్‌ఎస్ హాలు తలుపులను పెద్దగా కొట్టడంతో చాంబర్‌లో ఉన్న డీఆర్వో నరసింహులు, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు తదితరులు క్యూ వద్దకు వారే వచ్చి అర్జీలను స్వీకరంచారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు
పీజీఆర్‌ఎస్ నిర్వహణ బాధ్యత
పీజీఆర్‌ఎస్ నోడల్ ఆఫీసర్ బాధ్యతలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్‌కు అప్పగించారు. పదవి ఆమె చేతిలో ఉన్నా పెత్తనం మాత్రం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అర్జీదారులకు అవసరం అయిన కుర్చీలు, ప్రింటింగ్ అర్జీలు, తాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేయకపోవడంతో అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, దేవేంద్రరెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు.
ప్రభుత్వ భూములు కాపాడాలి
పుల్లంపేట మండలం అనంతసముద్రం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 329, 328, 327, 326, 333లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించారని పుల్లంపేట ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. దీంతో కలెక్టరేట్‌లో అధికారులకు అర్జీను ఇచ్చినట్లు స్పష్టం చేశారు.


