తుంబూరు అడవిలో చిరుత సంచారం
నారాయణవనం: మండలంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తుందన్న ఫిర్యాదుతో సోమవారం అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తుంబూరు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత జాడ కోసం గాలించారు. స్థానికుల కథనం మేరకు.. తుంబూరు పంచాయతీ శ్రీనివాస ఎస్టీ కాలనీకి చెందిన మునిరాజ మేకలను ఆదివారం సమీపంలోని అటవీ ప్రాంతంలో మేత కోసం తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం చిరుత సుమారు మేకపిల్లను నోట కరచుకుని అడవి లోకి వెళ్లిపోవాడాన్ని గమనించారు. రాత్రి పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సోమవారం అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీసులు శ్రీనివాస ఎస్టీ కాలనీ సమీపంలో అటవీ ప్రాంతాన్ని గాలించారు. చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించలేదు. క్రూర జంతువులు మేకను తీసుకుని వెళ్లి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా అడవిలో సంచరించడం, పశువులు, మేకలను మేత కోసం అడవిలోకి తోలవద్దని పోలీసులు సూచించారు.
ఫార్మర్ యాప్
సద్వినియోగం చేసుకోండి
తిరుపతి అర్బన్: కొత్తగా వచ్చిన ఫార్మర్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు వెల్లడించారు. ఈ–పంట నమోదుకు సంబంధించి రైతులే స్వయంగా తమ పొలంలోకి వెళ్లి మొబైల్ ద్వారా చేసుకోవడానికి కొత్తగా వచ్చిన ఏపీఏఐఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో రబీ సీజన్‌కు సంబంధించి ఈ–పంట నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 20వ తేదీకి నూరుశాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
గ్రూప్–2 ప్రతిభావంతులకు ఘన సత్కారం
తిరుపతి కల్చరల్: గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ప్రతిభావంతులను ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్వపు డైరెక్టర్ నైనారు శ్రీనివాసులు సోమవారం ఘనంగా సత్కరించి, అభినందించారు. సత్కారం అందుకున్న వారిలో రవి, మహేష్, సువర్ణ, చేతన్, సాయిరాం, బాలాజీ, విజయ్, మోహన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభతో గ్రూప్–2లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించి, ఉన్నత కొలువు అధిరోహించాలని సూచించారు.


