టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ
ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందన్నారు. కాగా మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాల్లో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి, స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. చైన్నెలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు, పరిపాలనా అనుమతుల అంశాలను బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ కూలిపోయే స్థితిలో ఉందన్నారు. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి, వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.


