కొండలనూ మింగేస్తున్నారు!
అంకణం రూ.50 వేలకు విక్రయం
కరకంబాడి కొండ కనుమరుగయ్యే ప్రమాదం
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ప్రభుత్వ భూములు ఆక్రమించిన కబ్జాదారుల కన్ను కొండలపై పడింది. కొండలను లక్ష్యంగా చేసుకుని వాటిని చదును చేస్తూ ఆక్రమణ పర్వానికి తెర లేపారు. ఓ వైపు కొండలను తవ్వి చదును చేస్తూ, మరో వైపు వాటిని ప్లాట్లు వేసి, విక్రయిస్తున్నారు. దీంతో కొండలు కనుమరుగవుతున్నాయి. రేణిగుంట మండలంలోని కరకంబాడి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండను తవ్వివేయడమే ఇందుకు నిదర్శనం.
కొండని తవ్వి చదును చేసిన ప్రాంతం
రేణిగుంట: మండలంలోని కరకంబాడి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండను స్థానిక టీడీపీ నాయకులు తవ్వి ప్లాట్లుగా మార్చి, విక్రయిస్తున్నారని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యాలయం పక్కనే కొండను హిటాచిలతో తవ్వి ఆ మట్టిని కొండ పక్కనే ఉన్న లోతుగా ఉన్న ప్రాంతంలో వేస్తూ ఆ ప్రాంతాన్ని చదును చేస్తూ ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇలా మార్చిన ప్లాట్లను స్థానిక టీడీపీ నాయకులు ఒక అంకణం రూ.50 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అడ్డుకోవాల్సిన అధికారులు, అధికార పార్టీనేతలతో లాలూచీ పడుతుండడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొండకు రెండు వైపులా అక్రమ తవ్వకాలు సాగిస్తూ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లో కొండ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
పాఠశాల ఆట స్థలం మాయం
కరకంబాడి రెవెన్యూ సర్వే నంబర్ 150లో 1997వ సంవత్సరంలో ఐదు ఎకరాల భూమిని కరకంబాడి జిల్లా పరిషత్ పాఠశాల ఆట స్థలానికి కేటాయించారు. కాలక్రమైన ఆక్రమణలకు గురవుతుండగా, ప్రస్తుతం మిగిలి ఉన్న స్థలంలో స్థానిక టీడీపీ నాయ కులు ప్లాట్లు వేసి, విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆట స్థలాన్ని కాపాడాల్సిన పంచాయతీ అధికారులు, పాఠశాల అధికారులు తమకెందుకులే అన్నట్లు ఉండడంతో అక్రమణదారులు ఆట స్థలాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు మేలుకుని ఉన్న స్థలాన్ని అయిన కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కోర్టులో కేసు ఉన్నా లెక్క చేయకుండా..
కరకంబాడి లెక్క దాఖలు 153 సర్వే నంబర్‌లోని భూమికి సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తికి మధ్య హైకోర్టులో కేసు ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తినీ భయపెట్టి, అధికారులను అటువైపు రాకుండా చూసుకుంటూ స్థానిక టీడీపీ నాయకులు ఎత్తు పల్లాలను చదును చేస్తూ విక్రయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు కరకంబాడి కొండను పరిశీలించి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
కొండని తవ్వి..ప్లాట్లు వేసి..
కొండలనూ మింగేస్తున్నారు!


