నాడు అంగీకరించారు.. నేడు అడ్డుకుంటున్నారు..!
చంద్రగిరి: మండలంలోని మోడల్ స్కూల్ ఏర్పాటుకు నాడు అంగీకరించిన నాయకులే నేడు పాఠశాలకు విద్యార్థులను పంపించకుండా అడ్డుకోవడం విమర్శలకు తావ్విస్తోంది. నాడు పాఠశాల పీఏసీ చైర్మన్‌తోపాటు స్థానిక తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు సంతకాలు చేశారు. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత దళిత విద్యార్థులతో కలసి తమ పిల్లలను చదివించమంటూ కులవివక్షను ప్రదర్శించడంతో పనపాకం హరిజనవాడ వాసులు నిరసనకు దిగారు. దీనిపై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి, విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత సోమవారం మరోసారి తమ పిల్లలతో నిరసనకు దిగి, పాత పాఠశాలలోనే తరగతులు నిర్వహించాలంటూ స్పష్టం చేశారు.
పాఠశాలకు తాళాలు వేసి..!
పనపాకం హరిజనవాడ మోడల్ స్కూల్‌లో దళిత విద్యార్థులతో కలసి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులను చదవించేందుకు అరిగెలవారిపల్లెకు చెందిన స్థానికులు అంగీకరించలేదు. ఈ క్రమంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనధికారికంగానే అరిగెలవారిపల్లెలో పాఠశాల నిర్వహించేలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీనిపై కథనాలు రావడంతో విచారణ చేపట్టిన అధికారులు తిరిగి అరిగెలవారిపల్లెకు చెందిన 3,4,5వ తరగతి విద్యార్థులు పనపాకం హరిజనవాడ మోడల్ స్కూల్‌కు రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉద యం అరిగెలవారిపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు స్థానిక టీడీపీ నేత తాళాలు వేశారు. విషయం బయటకు పొక్కడం, పోలీసులకు వస్తున్నట్లు తెలుసుకుని తాళాలను తీసేసినట్లు స్థానికులు తెలిపారు.
మా స్కూలే మాకు కావాలంటూ నిరసన
తమ పాఠశాలలోనే తమకు చదువులు చెప్పాలంటూ విద్యార్థులతో కలసి స్థానిక టీడీపీ నాయకులు, వారి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువులు చెప్పాలని, తమకు కులవివక్ష లేదంటూ వారు నినాదాలు చేపట్టారు. లేకుండా బీసీ నాయకులతో కలసి ఎంఈఓ కార్యాలయం వద్ద నిరసన చేస్తామని స్పష్టం చేశారు.


