వేగవంతంగా ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు
చంద్రగిరి/తిరుపతి రూరల్: వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే తమ లక్ష్యమని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి అన్నారు. మండలంలోని నారావారిపల్లి, కందులవారిపల్లి గ్రామాల్లో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన సీఎండీ విద్యుత్ సరఫరా, విద్యుత్ లైన్లు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, సోలార్ విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల అంశాలను పరిశీలించిన ఆయన గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నారావారిపల్లిలో ఏపీఎస్పీడీసీల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ సబ్‌స్టేషన్ పనులను పరిశీలించారు. త్వరితగతిన ఆ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 11కేవీ, ఎల్టి, వేలాడుతున్న వ్యవసాయ విద్యుత్ లైన్లను, ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలను పరిశీలించిన ఆయన అన్నింటినీ వెంటనే సరిచేయాలని, దిమ్మెల ఎత్తు పెంచి కంచెను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్ ఖాన్, ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ చిన్న రెడ్డెప్ప, ఏడీఈ శేషాద్రి రెడ్డి, ఏఈలు నాగరాజ, వెంకటరమణ పాల్గొన్నారు.


