వరద.. వదలని బురద
వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఈ నెల 6వ తేదీ సంభవించిన ఓళ్లూరు రాయల చెరువు వరద ఘటనలో కళత్తూరు, పాతపాళెం దళితవాడలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రమాదం సంభవించి 3 రోజులు గడిచినా ఆ గ్రామాలు ఇప్పటికీ తేరుకోలేదు. కొట్టుకొచ్చిన బురదను వదిలించుకునేందుకు బాధితులు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ 50శాతం బురద కూడా ఆ గ్రామాన్ని వదల్లేదు. అటు ఇళ్లు, ఇటు వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిం చేందుకు ఇక్కట్టు ఎదుర్కొంటున్నారు.
నామమాత్రంగా ప్రభుత్వ సాయం
ప్రభుత్వం తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 3వేలు నగదు, 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే శుక్రవారం సాయంత్రం హడావిడిగా సత్యవేడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఐదు కుటుంబాలకు సాయం అందించినట్లు అధికారులు ఫొటోలకు ఫోజులిచ్చారు. మిగిలిన కుటుంబాలకు శనివారం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించి మరచిపోయారు. దీంతో బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంతటి విపత్తు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
కన్నెత్తి చూడని మంత్రులు
జిల్లాలో అతిపెద్ద విపత్తుగా పరిగణిస్తున్న ఓళ్లూరు రాయలచెరువు ఘటనపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వందలాది పశువులు మృత్యువాడగా, వెయ్యి ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. ఇంత పెద్ద ఘోరం జరిగితే ఒక్క మంత్రి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. జరిగిన నష్టానికి పూర్తిస్థాయి పరిహారం అందాలంటే అధికార యంత్రాంగం పర్యటిస్తే సరిపోదు. మంత్రులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని కళ్లారా చూసి తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళితేనే బాధితులకు సక్రమంగా న్యాయం జరుగుతుంది. ఈ క్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, విపత్తుశాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓళ్లూరు రాయల చెరువు వరద బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. విపత్తు జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ బురదలోనే కాలం గడుపుతున్నారు. నామమాత్రం సహాయక చర్యలతో అధికారులు చేతులుదులుపుకోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఫొటోలకు ఫోజులిచ్చి జారుకోవడంతో ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి
రాయలచెరువు ఘటనలో ముంపునకు గురైన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. శనివారం కళత్తూరు దళితవాడ, పాతపాళెంలో వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలసి ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. విపత్తు కారణంగా జరిగిన నష్టాలను, హృదయ విదారక దృశ్యాలను చూసి చలించిపోయారు. విపత్కర సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంపీ మాట్లాడుతూ తూతూ మంత్రంగా పరిహారం ప్రకటించి తప్పుకోవాలనుకుంటే సహించే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో పోరాడుతామని హెచ్చరించారు. తక్షణ సహాయక చర్యల కోసం ఎంపీ నిధుల నుంచి రూ. 20లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. విపత్తు జరిగి 3 రోజులు గడిచినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. గ్రామాల్లో పేరుకుపోయిన బురదను తక్షణమే తొలగించాలని కోరారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. నూకతోటి రాజేష్ మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు హౌసింగ్ ద్వారా నివాసాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టం జరిగిన రైతులకు, దెబ్బతిన్న పొలాలకు, మృతి చెందిన పశువులకు నష్ట పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గవర్ల కృష్ణయ్య, జిల్లా మహిళా అధ్యక్షులు మాధవిరెడ్డి, నేతలు నందకుమార్, భరణి ధనంజయరెడ్డి, లాల్‌బాబు యాదవ్, శాస్త్రి రాజు పాల్గొన్నారు.
వరద.. వదలని బురద
వరద.. వదలని బురద


