గజ దాడులు ఆగేనా?
వణికిపోతున్న ప్రజలు
ఏనుగుల దాడుల్లో మృత్యువాత
పడుతున్న రైతులు
కట్టడి చేయడంలో అటవీ అధికారులు విఫలం
లబోదిబోమంటున్న రైతన్నలు
డిప్యూటీ సీఎం స్పందించి న్యాయం చేయాలంటున్న బాధితులు
చంద్రగిరి : గజరాజుల ఘీంకారాలు..పంట పొలాలపై దాడులు..అడ్డొచ్చిన రైతులను హతమార్చుస్తుండడం.. ఫలితంగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ప్రజలు.. ఇది శేషాచల, నాగపట్ల, భాకరాపేట బీట్ల పరిధిలో నివసిస్తున్న రైతుల దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలుగా అటవీ సమీప గ్రామాల్లో గజరాజుల దాడులు నితృకృత్యమవుతున్నాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో గజ దాడుల కారణంగా పంటలు నాశనం అవుతున్నాయి. రాత్రుల్లో ఏనుగుల గుంపులు గ్రామాల్లో స్వైర విహారం చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏనుగుల దాడులను అరికట్టాల్సిన అటవీ అధికారులు కంటి తుడుపు చర్యలు చేపట్టడం పరిపాటిగా మారింది.
పరిస్థితి ఇలా..
ఏనుగుల దాడులను అరికట్టాల్సిన అటవీ అధికారులు చేతులెత్తేయడంతో రైతులే వాటిని ఎదుర్కొనేందుకు సాహిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగుల దాడుల్లో ఓ వైపు పంట పొలాలను ధ్వంసం కావడంతో రైతులే వాటిని కట్టడి చేసేందుకు పూనుకుంటున్నారు. గత జనవరిలో కందులవారిపల్లి(సీఎం చంద్రబాబు సొంత పంచాయతీ) ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు రాకేష్ చౌదరి కొంత మంది రైతులతో కలసి ఏనుగులను తరిమేందుకు యత్నించాడు. గజరాజులు ఒక్కసారిగా వారిపై దాడులకు పూనుకున్నాయి. ఈ దాడుల్లో టీడీపీ నాయకుడు రాకేష్ చౌదరిని చంపేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. గత ఏడాది నవంబర్ 23న భాకరాపేట పంచాయతీలోని పంట పొలాల్లో రైతుల ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగ తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. అలాగే అదే మండలంలో మే 5న చిట్టేచర్ల పంచాయతీ దాసర్లపల్లికి చెందిన రైతు సిద్ధయ్య పొలంలో నిద్రిస్తుండగా ఏనుగులు దాడి చేసి చంపేశాయి.
చేతులెత్తేసిన అటవీ అధికారులు
పొలాలపై ఏనుగుల దాడులు చేస్తున్నా వాటిని కట్టడి చేయడంలో అటవీ అఽధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా బాధితులు ఏనుగుల దాడులపై సమాచారం ఇచ్చానని..స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కంటే భిన్నంగా అటవీ అధికారులు వ్యవహరించడంపై రైతులు, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై తిరుగుతూ టపాసులు కాల్చి వెళ్లిపోతున్నారే తప్ప, పూర్తి స్థాయిలో ఏనుగుల అరికట్టడంలో విఫలమవుతున్నారని రైతులు మండిపడుతున్నారు. అటవీశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా పనిచేస్తున్నా..చర్యలు మాత్రం లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంటలపై దాడులు
చంద్రగిరి, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం మండలాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న గజరాజులు రాత్రుల్లో పొలాలపై వీర విహారం చేస్తున్నాయి. వరి, చెరకు, మామిడి, అరటి పంటను తొక్కి నాశనం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో చేతికి వచ్చే వరి పంట సైతం తొక్కేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సుమారు 10కు పైగా ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేయడంతో పాటు ఇటీవల చంద్రగిరి మండంలోని చిన్నరామాపురం గ్రామంలోని ఏనుగులు రావడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారి గ్రామంలోకి ఏనుగులు రావడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిహారానికి ఎదురుచూపులే
20 రోజుల్లో చేతికి వచ్చే పంటను 10 రోజుల కిందట ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి పండించిన పంట నాశనం అయింది. ఇప్పుడు భూమి యజమానికి నేను ఎలా నగదు చెల్లించాలి. అటవీ అధికారులేమో పచ్చి వడ్లను కోసుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇలా ఎవరైనా చేస్తారా..? పరిహారం కూడా నామమాత్రంగా అందిస్తున్నారు.. పరిహారం కోసం మరో ఆరు నెలలు ఆగాల్సి వస్తోంది.
– చిన్నబ్బ, కౌలు రైతు
ఏనుగుల కట్టడికి
శాశ్వత పరిష్కారం చూపాలి
గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పంట పొలాలపై దాడు లు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా ఏనుగులు పెద్ద ఎత్తున పంట పొలాలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. అధికారులు వచ్చి ఎన్ని చర్యలు తీసుకున్నా, ఏనుగుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఏనుగుల దాడు లను నివారించేందుకు శాశ్వత పరిష్కారం చూపి తే రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది.
– రాగిణి, సర్పంచ్, చిన్నరామాపురం
గజ దాడులు ఆగేనా?
గజ దాడులు ఆగేనా?


