శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,075 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,535 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్వనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
భక్తుల సౌకర్యార్థం
హెల్ప్ డెస్క్‌లు
తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని కల్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవలకు ద్వారా సేకరించిన భక్తుల అభిప్రాయాలపై శనివారం పద్మావతి విశ్రాంతి భవనంలో సమీక్షించారు. విభాగాల వారీగా అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు ఈఓ మాట్లాడుతూ కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు తరచూ తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించేటప్పుడు సిబ్బంది చేతులకు తొడుగులు ధరించాలని సూచించారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గదుల కాషన్ డిపాజిట్ చెల్లింపుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూల్లో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. అలాగే పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారానికి యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్ల గుర్తింపు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
తిరుపతి సిటీ : మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడిపై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు.. ఏర్పేడు మండలం అముడూరు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సెలవులో ఉండడంతో, పల్లం దళితవాడ ఎంపీపీఎస్ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ నాగరాజును డిప్యుటేషన్ మీద పంపించారు. అయితే ఆ ఉపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు వచ్చి పడిపోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న ఎంఈఓ వెంటనే డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారించి సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు.
బాలికల సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతి సిటీ:కర్ణాటకలోని కిట్టూర్ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్స్‌లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఫిబ్రవరి ఒకటో తారీఖున ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నారు. వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ పోటీ పరీక్షల సమాచార కేంద్రం, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వైభవంగా రుద్రహోమం
తిరుపతి కల్చరల్:శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం వైభవంగా రుద్రహోమం ప్రారంభమైంది. కార్తీక మాసం సందర్బంగా ఆలయంలో హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నా రు. అందులో భాగంగా చేపట్టిన రుద్ర హోమం ఈనెల 18వ తేదీ వరకు జరిపించనున్నారు. ఈమేరకు యాగశాలలో పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, హారతి సమర్పించారు. డిప్యూటీ ఈఓ నాగరత్న పాల్గొన్నారు.


