
కలెక్టరేట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి కలెక్టరేట్ కార్యాలయానికి మళ్లీ బాంబు బెదిరింపులు తప్పలేదు. శుక్రవారం ఏకంగా కలెక్టరేట్ భవనాన్ని పేల్చి వేస్తామంటూ సంక్షిప్త సందేశాలు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో బెదిరింపులు వచ్చిన సందర్భంగా బాంబు పెట్టామని సమాచారం ఇచ్చారు. ఈ సారి పేల్చి వేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో పాటు ఉదయం 10 గంటల సమయంలో మెసేజ్ పెట్టారు. దీంతో ఉద్యోగులు భయం భయంగా డ్యూటీలు చేశారు. కొందరు అయితే డ్యూటీకి వచ్చి చిన్న పని ఉందంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య దళం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణం అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది తప్పుడు సమాచారంగా నిర్ధారించారు. ఈ సంఘటనతో కొంతసేపు కలెక్టరేట్ ప్రాంగణంలో మొత్తం హడావుడి పరిస్థితి నెలకొంది. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. మెసేజ్ చేసిన వ్యక్తి వివరాలు కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ వెల్లడించారు.