
బాలుడి ఆత్మహత్యపై విచారణ
చంద్రగిరి: బాలుడి ఆత్మహత్యపై గురువారం పోలీసు, ఎకై ్సజ్ అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన బాలుడిని మందలించడంతోపాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పారిపోయిన బాలుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణాధికారులు బాలుడు పాఠశాలకు ఎన్ని గంటలకు వచ్చాడు. మద్యం సేవించి ఎందుకు వచ్చాడు. మద్యం బాటిల్ బ్యాగులో పెట్టుకుని ఎందుకు వచ్చాడన్న కోణంలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉదయం 8.30 గంటలకు పాఠశాల వచ్చిన బాలుడు మద్యం సేవించడంతోపాటు బ్యాగులో మద్యం బాటిల్‌ను పెట్టుకుని వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆపై బాలుడిని హెచ్‌ఎం వద్దకు తీసుకెళ్లామని, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో బాలుడు పరుగులు తీస్తూ పాఠశాలలో గోడ దూకి పారిపోయినట్లుగా అధికారులకు తెలిపారు.
మా బిడ్డను మాకు ఎందుకు అప్పగించలేకపోయారు
మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు పాఠశాల నుంచి హెచ్‌ఎం ఫోన్ ద్వారా సమాచారం అందించాడని బాలుడు బంధువులు తెలిపారు. తాము వస్తున్నామని చెప్పిన 10 నిమిషాలకు పాఠశాలకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే తమ బాలుడు పాఠశాల నుంచి పారిపోయినట్లుగా ఉపాధ్యాయులు చెప్పడం వారి విధులు నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. తమ బిడ్డకు ఎలాంటి దుర అలవాట్లు లేవని, బాలుడిపై అసత్యప్రచారం చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు ఇలాగే ప్రవర్తిసారా? అంటూ మండిపడ్డారు. తమ బిడ్డను తమకు అప్పగించలేకపోవడంలో ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. బాలుడు తప్పు చేస్తే, వారికి తెలియకుండా సమాచారం ఇవ్వాలే తప్ప, ఇలా బాలుడి ముందే ఎలా ఫోన్ చేస్తారంటూ మండిపడ్డారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డ మద్యం సేవించి ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడవుతుందని, ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించాడని చెప్పడం దారుణమన్నారు.
బెల్టు దుకాణం ద్వారా మద్యం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు
సీఎం చంద్రబాబు సొంత మండలంలో విచ్చల వి డిగా బెల్టు దుకాణాలు వెలిశాయి. 24 గంటలూ మద్యం లభిస్తుండడంతో ఇప్పటికే పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన బాలుడు బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పనపాకం నుంచి చంద్రగిరి వరకు 12 కిలోమీటర్ల దూరంలో సుమారు 15కు పైగా బెల్టు దుకాణాలను నడుపుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకోకుండా, అధికారులు మామూళ్లకు అలవా టు పడి వారికి సహకరిస్తున్నారంటూ మండిపడ్డా రు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.