
ఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్
తిరుపతి రూరల్ : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా లోతేటి శివశంకర్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయనను రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఐఏఎస్ క్యాడర్‌కు కేటాయించారు. దీనిపై ఆయన డీఓపీటీను ఆశ్రయించారు. ఎట్టకేలకు ఏపీ కేడర్‌కు పంపించారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్‌కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీగా ప్రభుత్వం నియమించడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కలసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాన శాఖల ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు.
సంతోష్‌రావుకు వీడ్కోలు
ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన సంతోషరావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్క రైతుకు సోలార్ పవర్‌ను చేరువ చేస్తామని నూతన సీఎండీ లోతేటి శివశంకర్ తెలిపారు. ఆయన సోమవారం తిరుపతి నగరంలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.