
చిరుత సంచారంపై అధికారుల అప్రమత్తం
తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచారంపై వీసీ ఆచార్య నర్సింగరావు విశ్వవిద్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ పరిసరాల్లో ఆయన పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు, ఆ ప్రాంతంలో తిరిగే వారికి తెలిసేలా బారికేడ్లను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్‌లో వెంకన్న శ్లోకం
– ఓం నమో వెంకటేశాయ
తిరుపతి అర్బన్ : ఓం నమో వెంకటేశాయ శ్లోకాన్ని కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన ద్వారం వద్ద స్వామి, అమ్మవార్ల చిత్రపటం వద్ద శనివారం ఏర్పాటు చేశారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం టీటీడీకి చెందిన భవనం నేపథ్యంలో ప్రధాన ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లకు చెందిన పెద్ద చిత్రపటాలను ఎప్పటి నుంచో ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే భక్తి భావాన్ని మరింత పెంచేలా ఓం నమో వెంకటేశాయ శ్లోకాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఈ శ్లోకాన్ని ఉంచుతారా? ప్రతి శనివారం ఉంచుతారో చూడాల్సిందే.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ : జాతీయ స్థాయి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్‌న్స్ ఎగ్జామినేషన్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ, 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1, 2014 నుంచి 2016 మధ్య జన్మించిన విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశాలకు, 9వ తరగతిలో ప్రవేశాల కోసం 2011 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2013 మార్చి 1వ తారీఖు మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్‌తో పాటు మరిన్ని వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రం నందు లేదా 8688888802 / 9399976999 నంబర్ల నందు సంప్రదించాలని ఆయన తెలిపారు.
‘నేలపట్టు’లో జర్మనీ దేశస్తులు
దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని శనివారం తడ ప్రాంతంలోని శ్రీసిటి నుంచి జర్మనీ దేశానికి చెందిన విదేశీయులు యాసుకోచిఎసి, మసాటోనిషియారా సందర్శించారు. కేంద్రంలోని చెరువుల్లో ఆశించిన స్థాయిలో వలస పక్షులు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ విదేశీయులను పలకరించి జామ మొక్కలను అందజేశారు.
తాళపత్రాల భద్రత అభినందనీయం
తిరుపతి సిటీ : ఎస్వీయూలో ప్రతిష్టాత్మకమైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలయాన్ని ( ఓఆర్ ఐ)ని శనివారం నూతన వీసీ తాతా నర్సింగరావు సందర్శించారు. గతంలో వెబ్‌సైట్‌లో చూసిన తాళపత్ర గ్రంథాలను నేరుగా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. సంస్థ సంచాలకులు ఆచార్య పీసీ వెంకటేశ్వర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిరక్షణకు తీసుకుంటున్న శాసీ్త్రయ విధానాలను చూసి అభినందించారు. ఇంత పెద్ద స్థాయిలో ప్రాచీన సాహిత్యం భద్రంగా సంరక్షించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, చంద్రశేఖర్, డాక్టర్ వెంకటేష్, సిద్దయ్య, బాషా, నాగరాజు,శోభన్ బాబు,విశ్వనాథ్ రెడ్డి, పరిశోధకులు సంతోష్,స ోమలింగడు, శోభన్ పాల్గొన్నారు.