
10 టన్నుల ఎర్ర చందనం స్వాధీనం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పది టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తిరుపతి ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. తిరుపతిలోని కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్ శనివారం వారు మీడియాతో మాట్లాడారు. టాస్క్‌ఫోర్స్ బృందం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలోని పత్తూరులో తమిళనాడుకు చెందిన రాజ్‌కుమార్ ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఆగస్టు 2న పట్టుబడ్డాడన్నారు. విచారణలో మరికొంతమంది నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు తేలడంతో దీనిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపామన్నారు. ఈ నెల 6న ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఇర్ఫాన్, మరో నిందితుడు అమిత్‌సంపత్ పవార్‌ను అరెస్టు చేశామన్నారు. మొత్తం 356 ఎర్రచందనం దుంగలను (9,576 కిలోలు) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.8 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.