
అర్జీదారుల మొర వినండి!
తిరుపతి అర్బన్: ‘ముందుగా అర్జీదారులు ఏం చెబుతున్నారో పూర్తిగా వినడం నేర్చుకోండి.ఆ తర్వాత సమస్యను ఎలా పరిష్కారించడానికి వీలుపడుతుందో వారికి వివరించండి. ఒక వేళ సమస్య పరిష్కారం చేయడానికి వీలులేకుంటే అందుకు కారణాలను స్పష్టంగా వారికి అర్థం అయ్యేరితీలో తెలియజేయండి. ప్రతి శాఖకు చెందిన అధికారులు ఈ అంశాన్ని పరిగణలో ఉంచుకోవాలి.’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 283 అర్జీలు అధికారులు అందుకున్నారు. అందులో రెవెన్యూ సమస్యలపై 172 అర్జీలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘవాన్సీ, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, సుధారాణి పాల్గొన్నారు.
ఆశతో వచ్చాం
తన భర్త నవీన్ ఓ పరిశ్రమలో కూలీ పనులకు వెళుతుంటారని, పేద కుటుంబానికి చెందిన తమ కుమారుడు ఆరాధ్య(6) దివ్యాంగుడని, పింఛన్ కోసం వచ్చామని బాలయపల్లె మండలం పెరిమిడి గ్రామానికి చెందిన శారద వాపోయింది. పింఛన్ కోసం తాము సచివాలయంతోపాటు మండల కేంద్రంలోనూ అర్జీలు అందజేసినా పింఛన్ మంజూరు చేయకపోవడంతో కలెక్టర్ ఏమైనా సాయం చేస్తారని ఆశతో వచ్చామని పేర్కొంది.
100శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంది
ఆర్థిక కష్టాలతో బతకడం కష్టంగా మారుతుందని, తమ బిడ్డ నిఖిలేశ్వర్‌కు వందశాతం వైకల్యం సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ మంజూరు చేయలేదని రేణిగుంట మండలానికి చెందిన ఏ. స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పేద స్థితిలో ఉన్నామన్నారు. తన కుమారుడికి పింఛన్ ఇప్పిస్తే, ఆ డబ్బులతో వైద్యం చేయిస్తామని చెప్పింది. లేదంటే తమ బతుకు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో ఉందని విలపించింది.
90 శాతం వికలత్వం ఉంది
పేద కుటుంబానికి చెందిన వాళ్లం. తన బిడ్డ ఆరాధ్యకు మానసిక స్థితి సక్రమంగా లేదని, 90శాతం వైకల్యం ఉందని, ఆ మేరకు సర్టిఫికెట్ ఇచ్చారని, అయినా పింఛన్ ఇవ్వలేదని తిరుపతి అర్బన్ మండలానికి చెందిన మాధవీలత పేర్కొంది. సచివాలయంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చామని తెలిపింది.
వితంతు పింఛన్ ఇవ్వండి
తన భర్త 8 నెలల కిందట మృతి చెందినా తనకు వితంతు పింఛన్ మంజూరు కాక ఇక్కట్టు పడుతున్నాని తిరుపతి అర్బన్ మండలం అబ్బన్నకాలనీకి చెందిన షేక్ అమినాబీ వాపోయింది. తనకు ఏ ఆధారం లేదని, తన భర్త పింఛన్ తీసుకుంటూ మృతి చెందితే ఆ పింఛన్ భార్యకు ఇస్తామని చెప్పారని పేర్కొంది. దాంతో ఆరు వారాలుగా గ్రీవెన్స్‌కు వస్తున్నా ఫలితం లేదని పేర్కొంది.
కలెక్టర్ ఆవరణలో ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు
న్యాయం చేయకుంటే సమ్మెబాట పడుతాం
సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయకుంటే సమ్మెబాట పడుతామని సచివాలయ ఉద్యోగసంఘం తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలో సోమవారం నగర కమిషనర్ మౌర్యకు సమ్మెకు చెందిన వినతిపత్రంతోపాటు తమ డిమాండ్లను తెలియజేశారు.
ఇంటింటా సర్వేలు చెప్పకండి
ఇంటింటా వెళ్లి పదేపదే సర్వేలు చేయమని చెప్పకండి. ప్రతి సర్వేకు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఓటీపీలు చెప్పడం లేదు. మాతో వాదిస్తున్నారు. మీకు ఓటీపీలు ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో వలంటీర్లు చేస్తున్న అన్ని పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం ఏ మాత్రం న్యాయబద్ధంగా లేదని సచివాలయ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. గ్రామ,వార్డు సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్, మహిళా అధ్యక్షురాలు గీత, ఉద్యోగ సంఘం నేతలు అమరావతి, సిద్దార్థ, ఈశ్వర్, మురళి, పుండ రీకాక్ష, పూర్ణ, నవీన్,నాగమోహన్, సుధారాణి, లక్ష్మి ప్రియ, రత్నమాలిని, రజని పాల్గొన్నారు.
కలెక్టరేట్‌కు తిరగడం నావల్ల కాదు
ఇక కలెక్టరేట్ ఆఫీస్‌కు తిరగడం తన వల్ల కాదని, ఆరు నెలలుగా తన భూమి సమస్య కోసం తిరుగుతూనే ఉన్నానని తొట్టంబేడు మండలం కృష్ణాపురానికి చెందిన సద్దికూటి వీరాస్వామి(79) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఓ పూలమాల మెడలో వేసుకుని దీక్షకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దాయనకు సర్ది చెప్పారు. గేటు వద్ద నుంచి లోనికి వెళ్లి అధికారులను కలవాలని సూచించారు. అనంతరం ఆయన నేరుగా కలెక్టర్ వెంకటేశ్వర్ వద్దకు చేరుకున్నారు. కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.