
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
సూళ్లూరుపేట: మున్సిపాలిటీ పరిధిలోని నూకలపాళేనికి ఉత్తరం వైపుగా పొలాల్లో తాటిచెట్టు బరకకు ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం పొలాల్లోకి వ్యవసాయం చేసుకోవడానికి వెళ్లిన రైతులు చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి 45–50 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని, మృతుడి వద్ద ఎలాంటి అనవాళ్లు దొరకలేదని తెలిపారు. ఆకుపచ్చ టవల్‌తో ఉరివేసుకుని మృతి చెందాడని తెలిపారు. బ్లూకలర్ గళ్లు కలిగిన షార్ట్ వేసుకుని ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తెలిపారు.
కుటుంబ కలహాలతో..
దొరవారిసత్రం: కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఇట్టగుట్ట ధనంజయ(35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటన కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కల్లూరు గ్రామానికి చెందిన ధనుంజయ ఆదివారం స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో తన భార్య మందలించింది. దీన్ని మనస్సులో పెట్టుకుని క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసేలోపు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పలువురు నాయకులు సోమవారం ధనుంజయ మృతదేహాన్ని సందర్శించి నివాళ్లలర్పించారు.