
పొలంలో కారు బోల్తా
నాగలాపురం: మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న పొలంలో కారు బోల్తా పడింది. పోలీసులు కథనం మేరకు.. తమిళనాడులోని మాధావరానికి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి చైన్నెకు వెళుతుండగా మార్గం మధ్యలోని సుబ్బనాయుడు కండ్రిగ వద్ద కుక్క అడ్డంగా రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. అదృష్టవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని కలగలేదని చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు.
నగల చోరీ
పాకాల: ఇంట్లోకి చొరబడి నగలు అపహరించిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి విచ్చింది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని ఓబులశెట్టివారిపల్లికి చెందిన అప్పాజీనాయుడు ఈ నెల 27వ తేదీన కుటుంబ సమేతంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. తిరుమల యాత్ర ముగించుకుని సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన అప్పాజీ నాయుడు కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని 35 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండి వస్తువులు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో
పెయింటర్ దుర్మరణం
చంద్రగిరి: విద్యుత్ షాక్‌కు గురై పెయింటర్ మృతి చెందిన ఘటన తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి భవానీ నగర్‌కు చెందిన లోకేష్(36) పెయింటింగ్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రోజూవారీ పనుల్లో భాగంగా మంగళం సమీపంలోని కోళ్లఫారం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పనుల్లో నిమగ్నమయ్యాడు. పెయింటింగ్ పని చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై కింద పడి కుప్పకూలిపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు గమనించి లోకేష్‌ను హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొలంలో కారు బోల్తా