
● ఎన్నాళ్లీ కష్టాలు!
తిరుపతి జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలకు శ్మశాన వాటికలు లేవు. ఉన్న వాటికి సరైన దారి సౌకర్యం లేదు. చాలా శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురైనా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు. మృతదేహాలను తీసుకెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం మేజర్ పంచాయతీలో ఆదివారం చోటుచేసుకుంది. నాగలాపురంలోని వీకేఎం వీధికి చెందిన దేశమ్మ మృతి చెందింది. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి దారి సౌకర్యం లేక నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఊరులో నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని దొమ్మర కాలనీ వరకు వాహనంపై తీసుకెళ్లి, అక్కడి నుంచి పొలం గట్టుపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక్కడ శ్మశాన స్థలం కొంతమేర ఆక్రమణకు గురైంది. దానికితోడు శ్మశాన దారి ప్రారంభంలో దొమ్మర కాలనీ పంచాయతీకి తాగునీటి బోరు వేసి నీరు అందిస్తున్నారు. ఈ బోరు అడ్డంగా ఉండడంతో శ్మశానానికి రోడ్డు నిర్మాణం చేపట్టలేని పరిస్థితి నెలకొంది. అధికారులు చొరవ తీసుకుని ఈ బోరును మరో చోటుకు మార్చి, శ్మశాన వాటికకు దారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – నాగలాపురం