
ప్రాణం తీసిన ఈత సరదా
శ్రీకాళహస్తి : పట్టణంలో ముత్యాలమ్మ గుడివీధికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడు షేక్ హరూన్ (8) శనివారం నీటిపారుదలశాఖ కార్యాలయం సమీపంలో స్వర్ణముఖినదిలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. మరో బాలుడు గుణ(14) గల్లంతయ్యాడు. 1వ పట్టణ సీఐ గోపి కథనం మేరకు .. సాయంత్రం 4 గంటల సమయంలో హరూన్‌తో పాటు కార్తీక్ (12), అనిల్(11), మరో ఇద్దరు గుర్తు తెలియని పిల్లలు మొత్తం ఆరుగురు స్వర్ణముఖినదిలో ఈతకొడుతున్న సమయంలో హరూన్, గుణ ప్రమాదవశాత్తు వేగంగా వస్తున్న నీటిలో కొట్టుకుపోయారు. అది చూసి నలుగురు పిల్లలు కేకలు వేయ గా మున్సిపాలిటీలో పని చేసే అరుణ్ గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హరూన్ మృతదేహాన్ని బయటకు తీయగా మరొక బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. కుమారుడు నీట మునిగి మృతి చెండంతో నజీర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గల్లంతయిన బాలుడు గుణ రామచంద్రయ్య కుమారుడిగా గుర్తించారు. అతడి ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి , గల్లంతైన బాలుడు కోసం గాలిస్తున్నారు.