
స్వర్ణముఖి ప్రవాహంలో రైతు గల్లంతు
పెళ్లకూరు : స్వర్ణముఖినది ఆవల తీరాన ఉన్న పొలాల్లో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి ఇంటికెళ్లే సమయంలో నదిని దాటుతుండగా నీటి ప్రవాహంలో చమర్తి పాపయ్య(65) అనే రైతు గల్లంతైన ఘటన శనివారం పెళ్లకూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు సమాచారం మేరకు చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన చమర్తి పాపయ్య వ్యవసాయ పనుల నిమిత్తం స్వర్ణముఖినదిని దాటుకొని పొలాల్లోకి వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో నదిని దాటుతుండగా అప్పటికే తెలుగు గంగ జల ప్రవాహం స్వర్ణముఖినదిలో ఎక్కువ కావడంతో నీటి ప్రవాహంలో పాపయ్య కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ నాగరాజు, నాయుడుపేట అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ రాత్రి సమయం కావడంతో పాపయ్య ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.