
రోడ్లు విధ్వంసం
వరదయ్యపాళెం : కంకర తరలించే టిప్పర్లు నిబంధనలు పక్కన పెట్టి ఓవర్ లోడ్‌తో ఇష్టారాజ్యంగా రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూలుతున్నారు. దీంతో తమకెవరు అడ్డు అన్న చందంగా రోజు వందల సంఖ్యలో టిప్పర్లు కంకర లోడ్‌లతో తమిళనాడు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రధానంగా సత్యవేడు మండలం చమర్తకండ్రిగ వద్ద మూడు కంకర క్వారీలు ఉన్నాయి. అలాగే వరదయ్యపాళెం మండలం మరదవాడ వద్ద రెండు క్వారీలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి రోజు వందల టిప్పర్లు కంకరను తమిళనాడుకు తరలిస్తున్నాయి. అయితే వీరికి నిబంధనలు ఏ మాత్రం అడ్డురావు.
రోజుకు 200కు పైగా టిప్పర్లు..
ప్రధానంగా చిన్న పాండూరు నుంచి నాగలాపురానికి వెళ్లే రోడ్డు మార్గంలో చమర్తకండ్రిగ వద్ద మూడు కంకర క్వారీలు ఉన్నాయి. ఈ మార్గంలో రోజువారీ తమిళనాడుకు 200కు పైగా టిప్పర్ లారీలతో కంకర తరలిస్తారు. ఓవర్ లోడ్‌తో రాకపోకలు చేస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఆ మేరకు చిన్న పాండూరు నుంచి నాగలాపురానికి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రధానంగా చిన్న పాండూరు నుంచి చమర్తకండ్రిగ వరకు 12 కి.మీలు రోడ్డు బావులను తలపించే విధంగా రోడ్డు ధ్వంసమైంది. అటువైపుగా వెళ్లాల్సిన సామాన్య జనం, వాహనదారులు ఛిద్రమైన రోడ్డులో ప్రయాణించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నిలువరించేనా?
పరిమితికి మించి అదనపు టన్నేజీలతో తమిళనాడుకు వెళ్తున్న టిప్పర్లను రవాణాశాఖ అధికారులు నిలువరించే పరిస్థితి ఉందా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రోజువారీ 200కు పైగా టిప్పర్లు 50 టన్నులకు పైగా బరువుతో పరిమితికి మించి రవాణా అవుతున్నా ఆ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. వరదయ్యపాళెం మండలం మరదవాడ నుంచి రోజు పదుల సంఖ్యలో టిప్పర్లు అదనపు టన్నేజీతో తమిళనాడుకు తరలిపోతున్నా పట్టించుకునే దిక్కు లేదు. దీని కారణంగా నెలవాయి నుంచి తడ వరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇంత జరుగుతున్న రవాణా శాఖ అధికారులు మొద్దునిద్ర వీడడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.