
కాశిపెంట్లలో దోపిడీ దొంగల బీభత్సం
చంద్రగిరి: మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. ముఖానికి ముసుగు ధరించి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి, వృద్ధుల చేతులు కాళ్లు కట్టేసి అందిన కాడికి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, మండల పరిధిలోని కాశిపెంట్లకు చెందిన నాగేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు వృద్ధులు నివాసం ఉంటున్నారు. నాగేశ్వరరావు వృద్ధులతో కలసి అమెరికాలో ఉన్న కుమారుడు ప్రసాద్ తో శుక్రవారం రాత్రి వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన గుర్తు తెలియని నలుగురు యువకులు నాగేశ్వరరావు ఇంటి ముందు ఆగి, హారన్ మోగించారు. ఎవరో వచ్చారంటూ బయటకు వచ్చిన నాగేశ్వరరావుపై దాడి చేసి ఇంటి లోపలకు బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై నాగేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు వృద్ధుల చేతులు కట్టేసి, కత్తులతో బెదిరించారు. ఆపై ఇంట్లో ఉన్న రూ.70వేల నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. వీడియో కాల్లో ఉన్న కుటుంబ సభ్యుడు దొంగతనాన్ని పసిగట్టి వెంటనే తన సెల్‌ఫోన్ నుంచి సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి దోపిడీ దొంగలు పడ్డారని, ఇంట్లో వారిని బెదిరిస్తున్నారని తెలియజేశారు. అప్పటికే ఇంటిని దోచేసిన దుండగులు గోడదూకి కారులో పరారయ్యారు. ఈ క్రమంలో గ్రామస్తులు కారును వెంబడించడంతో పాటు కారుపై దాడికి యత్నించారు. అయినప్పటికీ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు బాధితుడు నాగేశ్వర రావు పోలీసులకు సమాచారం అందించడంతో ఇన్‌చార్జ్ సీఐ ఇమ్రాన్ బాషా తన సిబ్బందితో కలసి ఇంటిని పరిశీలించారు. దోపిడీ దొంగల బీభత్సం రికార్డు అయిన సీసీ కెమెరాలను పరిశీలించారు.

కాశిపెంట్లలో దోపిడీ దొంగల బీభత్సం

కాశిపెంట్లలో దోపిడీ దొంగల బీభత్సం

కాశిపెంట్లలో దోపిడీ దొంగల బీభత్సం