చంద్రగిరి : ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సులభ రీతిలో బోధించడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీశంకర్ అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఐతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో ఇలాంటి సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించి, బోధన మెరుగుపరచాలన్నారు. విద్యార్థులు సాఽధించాల్సిన నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం ఆయన 1, 2వ తరగతి చిన్నారులకు సులభతరంగా విద్యనందించేందుకు ఉపయోగపడే ఎఫ్‌ఎల్‌ఎన్, జాదూ, టీఏఆర్‌ఎల్ కిట్లను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ శివ శంకరయ్య, ఎంఈఓలు లలిత కుమారి, భాస్కర్ బాబు, హెచ్‌ఎం జయరాం నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోక్సో కేసులో రిమాండ్
పాకాల : నాలుగో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు మహ్మద్‌అలీ (శివ)కు స్థానిక కోర్టు న్యాయమూర్తి పూర్ణిమాదేవి రిమాండ్ విధించారు. శనివారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈనెల 18న.. 7గంటల ప్రాంతంలో నిందితుడు ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయంపై శుక్రవారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించి, చిత్తూరు సబ్ జైలుకు తరలించారు.
రూ.12 లక్షల నగదు స్వాహా
నాయుడుపేట టౌన్ : నాయుడుపేట పట్టణంలోని రెండు థియేటర్లను లీజు తీసుకొని సురేష్ ప్రొడక్షన్‌కు చెందిన రూ.12 లక్షలు నగదు స్వాహా చేసిననట్లు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర, సీఎస్ తేజ థియేటర్లకు సంబంధించి బ్యాంక్‌కు నగదు లావాదేవీలు జరిపే వెలుగు వెంకట సాయి అనే వ్యక్తి మూడు నెలలుగా బ్యాంక్‌కు నగదు తక్కువగా చెల్తిస్తూ సుమారు రూ.12 లక్షల వరకు స్వాహా చేసినట్లుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఽథియేటర్ల యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ బాబి కేసు నమోదు చేశారు.