సత్యవేడు : హత్యాయత్నం కేసుకు సంబంధించి సత్యవేడు హరిజనవాడకు చెందిన నిందితుడు సీమాన్ (25)ను శనివారం అరెస్టు చేయగా, గంజాయి కేసులో సత్యవేడు పంచాయతీలోని దళవాయి అగ్రహారానికి చెందిన నిందితుడు శ్రీధర్ (34)ను అరెస్టు చేసినట్లు సీఐ మురళీనాయుడు తెలిపారు. పోలీసుల కథనం మేరకు నిందితుడు శ్రీధర్ నుంచి రూ.20 వేలు విలువ చేసే 1.5 కేజీల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అలాగే మరో కేసులో జులై 15 తేదీన శ్రీ సిటీ కంపెనీలో పని ముగించుకొని సత్యవేడు – శ్రీకాళహస్తి బస్టాండు సమీపంలో ఆటోను అడ్డగించి సీమాన్ గొడవ చేశాడన్నారు. కొన్ని రోజులుగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న వారిని సీమాన్ అతని సోదరుడు లారెన్స్ కలిసి కత్తులతో దాడి చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి ఇరువురిపై తడ, తమిళనాడు స్టేషన్‌లలో పలు కేసులు నమోదైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామస్వామి, కానిస్టేబుల్ శ్రీధర్ పాల్గొన్నారు.