
రోడ్డు ప్రమాదంలో మెకానిక్ దుర్మరణం
నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని మూర్తిరెడ్డిపాళెం గ్రామ సమీపంలో జాతీయ రహ దారిపై ఽఽశనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ మెకానిక్ పేట లక్ష్మణ్(29)దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ ఓ ట్రాక్టర్ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఽశనివారం సాయంత్రం ట్రాక్టర్ సర్వీసు చేసేందుకు వెళ్లి తిరిగి బైక్‌పై నాయుడుపేటకు వస్తున్నాడు. ఈ క్రమంలో మూర్తిరెడ్డి పాళెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న ఐచర్ లారీ బైక్‌ను ఢీకొనడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆదిలక్ష్మి, ఏఎస్‌ఐ ధర్మయ్య సంఘటనా స్ధలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన మినీ లారీ వదిలిపెట్టి డ్రైవర్ పరారైనట్లుగా ఎస్‌ఐ గుర్తించారు. మినీ లారీను పక్కకు తరలించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. లక్ష్మణ్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వ వైద్యశాల వద్దకు లక్షణ్ కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని విగత జీవిగా పడి ఉన్న లక్ష్మణ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.