
రేపటి నుంచి దసరా సెలవులు
తిరుపతి సిటీ:జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలకు దసరా సెలవులు సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
28 నుంచి టీటీడీ విద్యాసంస్థలకు..
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలలకు ఈనెల 28వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినట్లు ఆయా కళాశాలలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు కొనసాగిస్తూ కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు. ఇంతలోపు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తి చేయాలని అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
స్కోచ్ పురస్కారం
అందుకున్న కలెక్టర్
తిరుపతి అర్బన్:న్యూఢిల్లీలోని ఇండియా హాబి టాట్ సెంటర్‌లో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ గోల్డెన్ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్రనాయుడుతో కలిసి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ శని వారం అందుకున్నారు. చంద్రగిరి మండలంలో ని రంగంపేట, కందుల వారిపల్లి, చిన్న రామాపు రం గ్రామ పంచాయితీల్లో సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 1600 గృహాలకు సౌర ఫలకాలను ఏర్పాటు చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ క్రమంలో పలువురు అవార్డు అందుకున్న కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.
తమిళ జాలర్ల బోటు పట్టివేత
వాకాడు : మండలంలోని శ్రీనివాసపురం గ్రామ సముద్ర తీరంలో అక్రమంగా వేట సాగిస్తున్న తమిళ జాలర్ల స్పీడు బోటును శుక్రవారం రాత్రి శ్రీనివాసపురం మత్స్యకారులు అడ్డుకుని బోటు ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మత్స్యకారుల వివరాల మేరకు అర్ధరాత్రి సమయంలో తీరానికి దగ్గరగా తమ పరిధిలో అక్రమ వేట సాగించి మత్స్య సంపదను దోచుకుపోతున్న కారికల్ ప్రాంతానికి చెందిన జాలర్లతో పాటు వారి బోటును అదుపులోకి తీసుకున్నారు. బోటు లో ఉన్న కారికల్ జాలర్లు 14 మందితో పాటు స్పీడు బోటును నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పోర్టులో మత్స్యకార పెద్దలకు అప్పజెప్పారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్:జాతీయస్థాయి జూనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు తిరుపతి క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 24 నుంచి 27వ వరకు బెంగుళూరు వేదికగా జాతీయ స్థాయి జూనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు తిరుపతి నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. తిరుపతిలోని ప్రశాంత్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు కిరణ్‌కుమార్, రేహాన్ షేక్, నవదీప్ రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వడంపై త్రోబాల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి చీనేపల్లి కిరణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆ పాఠశాల ఆవరణలో జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో పాల్గొననున్న ఆ ముగ్గురి క్రీడాకారులను జిల్లా కార్యదర్శి, ఆ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీశ్రీ అభినందించారు.
శ్రీవారి సేవలో
విద్యాదీశ తీర్థ స్వామీజీ
తిరుమల: తిరుమల శ్రీవారిని ఉడిపిలోని పలిమారు మఠం పీఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామీజీ శనివారం దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటు పేస్ కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

రేపటి నుంచి దసరా సెలవులు

రేపటి నుంచి దసరా సెలవులు