రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు
● ఎస్పీడీసీఎల్ ముందు ఆందోళన
● సమస్యలను తక్షణమే
పరిష్కరించాలని డిమాండ్ ● విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి.
● రాష్ట్ర ప్రభుత్వం అమలులో ఉన్న జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్ నిబంధనలను 1.2.1999 నుంచి 31.8.2004వరకు నియమితులైన ఉద్యోగులందరికీ వర్తింపచేయాలి.
● అవుట్‌సోర్స్, కాంట్రాక్టు లేబర్ పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి.
● కారుణ్య నియామకాలు కల్పించడంలో కొత్త, కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేట్ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు పరచి గత నాలుగు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించాలి.
● 2019లో నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్–2)ను రెగ్యులర్ జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలను వర్తింప చేయాలి.
● ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడేళ్ల నుంచి జరుపుతున్న పద్ధతిలోనే పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, డీఆర్‌లను మంజూరు చేయాలి.
● ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజినీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతి అవకాశం కల్పించాలి.
● ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌లో పనిచేసే ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూని యర్ ఇంజనీరు పోస్టుల్లో నియమించాలి.
● ఎంతో కాలంగా డిపార్ట్‌మెంట్ ఉద్యోగులతో నిర్వహించే 33/11కేవీ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఆపాలి.
● మూడు నెలలకోసారి సర్కిల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పీఎన్‌సీ సమావేశాలను నిర్వహించాలి.
● గతంలో అంగీకరించిన విధంగా అన్ని విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి, పని ప్రమాణాలను బట్టి అదనపు పోస్టులు మంజూరు చేయాలి.
● క్షేత్ర స్థాయిలో ప్రమాదాలు జరిగినప్పుడు సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర విచారణ జరిపిన తరువాతనే చర్యలు తీసుకోవాలి.
తిరుపతి రూరల్ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమై ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం రోడ్డెక్కారు. విధులు బహిష్కరించి కార్పొరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో అంగీకరించి ఆపై అమలు పరచకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జేఏసీ నేతలు దేవేంద్ర రెడ్డి, గోపి, ఐ.సుబ్రమణ్యం, చలపతి, జనార్ధన్‌రావు, నందగోపాల్, జయరామయ్య, మునస్వామి మాట్లాడుతూ ఇప్పటికే సమస్యలకు సంబంధించిన నోటీసును యాజమాన్యానికి అందించామన్నారు.
ఉద్యోగుల డిమాండ్లు ఇవి