
పంట కోత ప్రయోగాలపై శిక్షణ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : ఖరీఫ్ పంటల కోతకు సంబంధించిన ప్రయోగాలపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాదరావు, ముఖ్య ప్రణాళికాధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో శుక్రవారం స్ధానిక కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ నిపుణులు మాట్లాడుతూ.. పంట కోత ప్రయోగాలపై అవగాహన ఉన్నపుడే రైతులకు అవసరమైన పద్ధతుల మేరకు సూచనలు అందించవచ్చన్నారు. ఈ సందర్భంగా పంట కోత ప్రయోగానికి సంబంధించి మండల వ్యవసాయాధికారుల పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల ఏఎస్‌వోలు పాల్గొన్నారు.
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
వెంకటగిరి రూరల్ : పట్టణంలోని ఓ బాలికపై లైంగికదాడి నేపథ్యంలో నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. వైఎస్సార్ కడపకు చెందిన నాగరాజు.. వెంకటగిరిలోని తమ బంధువుల ఇంటికి అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాడన్నారు. ఈ క్రమంలో సమీపంలో ప్రాంతంలోని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నూతన పీఏసీ–5 భవనంలో టీటీడీ ఈవో తనిఖీలు
తిరుమల: తిరుమలలో నూతనంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పీఏసీ–5 భవనంలో శుక్రవారం టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవనంలోని హాళ్లు, అన్న ప్రసాద వితరణ హాలు, కల్యాణకట్ట, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన పీఏసీ–5 భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భవనంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బారాయుడు, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీకి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనం విరాళం
తిరుమల: బెంగళూరులోని ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎంఎస్ సుందర్ రామ్ అనే భక్తుడు శుక్రవారం తిరుమల శ్రీవారికి అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు రూ.14 లక్షల విలువైన అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనాన్ని విరాళంగా అందించారు. దీంతో పాటు టీటీడీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు విరాళం అందించారు. ఈమేరకు దాత శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి వాహనం తాళాలు, డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, డీఈ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.

పంట కోత ప్రయోగాలపై శిక్షణ