
లోకాయుక్త చేరిన నిధుల గోల్‌మాల్
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో చోటు చేసుకున్న నిధుల గోల్‌మాల్ వ్యవహారం లోకాయుక్తకు చేరింది. గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ ముచ్చేలి ప్రదీప్ కుమార్‌రెడ్డి పక్కదారి పట్టించారని, అదే గ్రామ పంచాయతీలో 9వ వార్డు సభ్యులుగా ఉన్న ముచ్చేలి కిరణ్‌కుమార్‌రెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారు. ఆ కేసులో పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినప్పటికీ అందుకు సంబంధించిన బాధ్యులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు దారు పేర్కొన్నారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారికి లోకాయుక్త నుంచి నోటీసులు చేరాయి. అందుకు సమాధానంగా జిల్లా పంచాయతీ అధికారి నుంచి చిగురువాడలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు అందరికీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, అలాగే పంచాయతీ సర్పంచ్ ముచ్చేలి ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దేవికి షోకాజ్ నోటీసు పంపించినా వారి నుంచి ఎలాంటి సంజాయిషీ తమకు రానందున మరోసారి నోటీసును జారీ చేశామన్నారు. షోకాజ్ నోటీసులకు వారి నుంచి సమాధానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని లోకాయుక్తకు నివేదించారు. జిల్లా పంచాయతీ అధికారి నుంచి లోకాయుక్తకు చేరిన నివేదికను జతపరుస్తూ ఆ నివేదికపై ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నవంబరు 19 లోపు చెప్పుకోవాలని లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత కాలం పంచాయతీకి పరిమితమైన నిధుల గోల్‌మాల్ రగడ లోకాయుక్తకు చేరడంతో మండలంలో ప్రధానంగా చర్చనీయాంశమైంది.