
శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం మఠ పీఠాధిపతి
తిరుమల: శ్రీరంగం మఠ పీఠాధిపతి వరాహ మహాదేశికన్ (అండవన్) స్వామీజీ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మీడియా రైటింగ్‌పై
కొత్త పుస్తకం
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ‘‘రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్, రేడియో అండ్ వీడియో’’ అనే కొత్త పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించింది. ఈ పుస్తకాన్ని కమ్యూనికేషన్, జర్నలిజం విభాగం ప్రొఫెసర్ బీఎన్ నీలిమ రచించారు. ప్రొఫెసర్ నీలిమ ఇప్పటికే రచించిన రెండు రచనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. తాజా ప్రచురణ, పత్రికలు, రేడియో, టెలివిజన్ మీడియా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఆ పుస్తకాన్ని వర్శిటీ వీసీ ఆచార్య వి.ఉమ బుధవారం ఆవిష్కరింగా రిజిస్ట్రార్ రజని కొత్త పుస్తకాన్ని అందుకున్నారు.
ఎర్రచందనం కేసులో
నలుగురికి ఏడాది జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో నలుగురికి ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి ఎస్.శ్రీకాంత్ బుధవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ బాబు ప్రసాద్, ఎఫ్‌ఆర్‌ఓ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. 2012 సెప్టెంబర్ 25వ తేదీ అన్నమయ్య జిల్లా, సానిపయ్య రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది పింఛా సెక్షన్, దిన్నెల బీట్, ముడంపాడు, అమ్మ బావి అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కేవీ పల్లి మండలం, నూతన కాల్వకు చెందిన సంగటి రమణయ్య, ఎర్రి మల్లయ్య, తుమ్మల శివ మల్లయ్య, వైవీ పాలెం మండలం, ఉస్తికాయల పెంటకు చెందిన బి.మల్లికార్జున్ ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శాంతి వాదించారు.