ఫిజియోథెరపీ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

ఫిజియోథెరపీ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

Sep 19 2025 3:08 AM | Updated on Sep 19 2025 3:08 AM

ఫిజియ

ఫిజియోథెరపీ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

తిరుపతి తుడా: స్విమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన మ్యాక్సిమన్‌ ఫిజియోథెరపీ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ డాక్టర్‌ సద్దాం హుసేన్‌ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తిరుపతి స్విమ్స్‌లో 55 మందిని ఎంపిక చేసి వారిలో 5 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ మాట్లాడుతూ స్విమ్స్‌లో ఎంతోమంది ఫిజియోథెరపీ, నర్సింగ్‌, అలైడ్‌ హెల్త్‌ సైన్స్‌ కోర్సులు పూర్తిచేసి విదేశాల్లో వివిధ హాస్పిటళ్లలో పనిచేస్తున్నారని, ప్రధానంగా ఫిజియోథెరపీలో శిక్షణ పొంది మంచి ఉపాధి అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుపతి మంగళం అటవీ ప్రాంత పరిసరాల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్‌, ఆర్‌ఐ సాయిగిరిధర్‌, ఆర్‌ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ కుమార్‌ బృందం మామండూరు నుంచి కరకంబాడి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున కూంబింగ్‌ చేపట్టారు. మంగళం సమీపంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు తరలిస్తూ కంటపడ్డారు. వారిని వెంబడించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్నవారు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో పాటు ఇద్దరిని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ రఫీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లు దగ్ధం

సైదాపురం: మండలంలోని ఊటుకూరు గ్రామంలో ఓ రేకుల ఇల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ కారణంగా దగ్ధమైన ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా.. ఊటుకూరు గ్రామానికి చెందిన రమణమ్మ గురువారం సాయంత్రం ఇంట్లో పనులు చేస్తుండగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ జరిగింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించి వస్తువులతో పాటు బీరువాలో ఉన్న నగదు, బంగారం, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఇల్లు కాలిపోవడంతో కట్టుబట్టలు మిగిలాయని.. తనకు అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు రమణమ్మ వేడుకుంది.

ఫిజియోథెరపీ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు 1
1/1

ఫిజియోథెరపీ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement