
కల్యాణ వెంకన్నకు పవిత్రాల సమర్పణ
తిరుపతిరూరల్ : తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు పవిత్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు. అనంతరం వేదపండితులు యాగశాల నుంచి పట్టు పవిత్రాలను మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయానికి తెచ్చి మూలమూర్తి మెడలో సమర్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామివారికి, పరివార దేవతామూర్తులకు, ధ్వజస్తంభానికి, ఆంజనేయస్వామికి, ఆలయం వెలుపల ఉన్న మహాగణపతి, మహాలక్ష్మీ అమ్మవార్లకు సమర్పించారు. పవిత్ర మాలల సమర్పణలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, ఆయన సోదరుడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి, మంజుల దంపతులతో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు పవిత్ర వితరణ..
పవిత్రోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం చతుష్టానార్చన, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపనతిరుమంజనం, పవిత్రవితరణ, చక్రస్నానం సాయంత్రం వీధి ఉత్సవంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

కల్యాణ వెంకన్నకు పవిత్రాల సమర్పణ