ఆక్వా రంగాన్ని ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

Sep 19 2025 3:08 AM | Updated on Sep 19 2025 3:08 AM

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

పార్లమెంటులో గళం విప్పిన ఎంపీ గురుమూర్తి అమెరికా సుంకాల తగ్గింపునకు ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్న స్పందించిన కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద్‌ సుంకాలను తగ్గించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హామీ హర్షం వ్యక్తం చేస్తున్న ఆక్వా సాగుదారులు

ఎగుమతికి సిద్ధంగా ఉన్న రొయ్యలు

చిల్లకూరు : ఆక్వా రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గళం విప్పి అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేయడంపై రొయ్యల సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికభాగం తిరుపతి జిల్లాలో రొయ్యల సాగు చేస్తున్నారు. సుమారు 175 కి.మీ. దూరం ఉన్న సముద్ర తీరాన్ని ఆసరా చేసుకుని చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో రొయ్యల సాగును సుమారుగా 28 వేల ఎకరాల్లో చేపడుతున్నారు. దీంతో ఏకంగా 1.25 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో సాగయ్యే రొయ్యల్లో సుమారు 70 శాతం వరకు అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేసి ఆర్థిక పరిపుష్టి సాధించేవారు.

ట్రంప్‌ చర్యలతో ఆర్థిక నష్టాలు..

రొయ్యల సాగుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలు పెంచి ఎగుమతులకు అడ్డుకట్ట వేశారు. దీంతో రొయ్యల రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో అమెరికా సుంకాలపై ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద్‌, సమగ్ర పరిశీలన జరిపిన తరువాత మైరెన్‌ ప్రొడక్ట్‌ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా)తో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అమెరికా పరస్పర సుంకాల నిర్ణయంతో ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధిక విలువలు కలిగిన సముద్ర జాతుల ఉత్పత్తిపై దృష్టి సారిస్తుందన్నారు. ఇందులో సిబాస్‌, కోబియా, పొంపానో, క్రాబ్‌, తిలాపియా, గ్రూపర్‌, బ్లాక్‌ టైగర్‌, స్కాంపి వంటి జాతులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తద్వారా ఆక్వా సాగుదారులపై ఆర్థిక భారం తగ్గించేలా సహాయ పడుతుందన్నారు. ఎంపెడా కూడా కొత్త మార్కెట్లను గుర్తించడంతో పాటు ఇప్పటికే ఉన్న మార్కెట్లను విస్తరించే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఆక్వా సాగుదారులకు లాభదాయకమైన ఆదాయ మార్గాలు వచ్చేలా విదేశీ ప్రదర్శనలు, దేశీయ మార్కెట్‌లో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి సమాధానం ఇవ్వడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా సాగుదారులకు అండగా నిలిచి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఎంపీ గురుమూర్తికి అండగా ఉంటామని ఆక్వా రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement