
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కాంస్యం
తిరుపతి రూరల్: బ్రెజిల్‌లో సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన బ్రిక్స్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంపిటిషన్‌లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎన్.రమాజ్యోతి కాంస్య పతకం సాధించారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లో స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, డిజిటల్ టెక్నాలజీల ఆధారంగా పోటీలు నిర్వహించారు. ‘‘స్మార్ట్, హ్యూమన్, హ్యాపీ అండ్ రెసిలియెంట్ సిటీస్’’ అనే ప్రధాన థీమ్‌కు చెందిన ఇన్నోవేషన్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. తిరుపతి నుంచి శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఇంజి అండ్ టెక్నాలజీ అధ్యాపకురాలు డా. ఎన్. రమాజ్యోతి తన బయో డిగ్రేడబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ ఉత్పత్తులు (బయో ప్యాక్ ఇన్నోవేషన్స్) ను ‘‘కేతనా టెక్‌బీస్’’ స్టార్టప్ తరఫున వర్చువల్‌గా ప్రదర్శించారు. అర్బన్ సస్టయినబిలిటీ–అడ్వాన్స్‌డ్ మ్యానుఫాక్చరింగ్ విభాగంలో ఆమె చేసిన ఆవిష్కరణకు కాంస్య పతకం లభించింది. ఈ సందర్భంగా యూనివర్శిటీ వీసీ ఆచార్య వి.ఉమ మాట్లాడుతూ పర్యావరణహితమైన, పట్టణ ప్రగతికి అనుగుణమైన పరిష్కారాలను తీసుకువచ్చే ఆవిష్కరణలకు ఇది గొప్ప గుర్తింపు అన్నారు. ఎన్.రమాజ్యోతి, ఎస్‌ఎస్‌ఐఐఈ–టీబీఐ బృందానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రజని అభినందనలు తెలిపారు.