
అటవీ పరిరక్షణ అందరి బాధ్యత
తిరుపతి మంగళం : అడవులు అంతరించిపోతున్నాయని, వాటి పరిరక్షణను అటవీ అధికారులతో పాటు ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని అటవీశాఖ అభివృద్ధి కార్యక్రమాల ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు సూచించారు. తిరుపతి పరిధిలోని ఎస్వీ జూపార్కు, నగర వనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. జూలో ఇటీవల వరుసగా పులులు, సింహాల మరణాలపై అక్కడి అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సందర్శకులకు అందిస్తున్న వసతులు, జంతువులకు అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. జూను మరింత అభివృద్ధి చేయడంపై జూ క్యూటరేటర్, సీసీఎఫ్ సెల్వంతో చర్చించారు. జూలోని జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జనావాల్లోకి ఏనుగులు, చిరుతలు, వన్యప్రాణులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం సీపీఎఫ్ సెల్వం, తిరుపతి జిల్లా అటవీ శాఖాధికారి వివేక్, డీఎఫ్‌వో శ్రీనివాసులు, సబ్ డీఎఫ్‌వో నాగభూషణం, ఎఫ్‌ఆర్‌వోలు సుబ్బరాయుడు, సుదర్శన్‌రెడ్డితో కలిసి నగర వనంలో పర్యటించారు. నగరవనంలో ఏర్పాట్లపై వాకర్లతో మల్లికార్జునరావు మాట్లాడారు. ఎస్వీ జూపార్క్, నగరవనంలో సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేలా తగు చర్యలు చేపట్టాలని అటవీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.