
ఆలయం తమదేనంటూ ఇరువర్గాల ఆందోళన
● కనకదుర్గమ్మ ఆలయంపై స్థానికులు, సింగు మహిళల మధ్య వివాదం ● భారీగా మోహరించిన పోలీసులు ● శ్రీనివాసమంగాపురంలో ఉద్రిక్తత
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ఆరు నెలలుగా గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం తమదేనంటూ స్థానికులు, సింగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని డీఎస్పీ కార్యాలయానికి రావాలని సూచించారు. గ్రామ పెద్దలతో పాటు సింగు కుల పెద్దలు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే సింగు మహిళలు పెద్ద సంఖ్యలో మంగళవారం ఆలయం వద్దకు చేరుకున్నారు. వారు వచ్చారని తెలుసుకున్న స్థానిక మహిళలు సైతం పెద్ద ఎత్తున గుమికూడారు. ఇరు వర్గాల మహిళలు ఒకరికొకరు ఎదురు పడటంతో వాగ్వాదానికి దిగారు. తరతరాలుగా మా గ్రామ దేవతగా ఉన్న ఆలయాన్ని సింగులు కాజేయాలని చూస్తున్నారంటూ స్థానిక మహిళలు ఆరోపించారు. ఏడాదిలో రెండుసార్లు వచ్చి పూజలు చేసుకునే వారని, ఇప్పుడు ఆలయమే తమదంటూ తప్పుడు పత్రాలను సృష్టించి, తమపై అక్రమంగా కోర్టులో కేసులు వేసినట్లు ఆరోపించారు. కొన్నేళ్లుగా సింగు కులస్థుల కులదైవమైన శ్రీకనకదుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అమ్మవారు ఇక్కడ వెలిశారే తప్ప, ఆలయ నిర్వహణ పూర్తిగా మా పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిందంటూ సింగు కులస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సింగు మహిళలు పెట్రోల్ బాటిల్‌తో తెచ్చుకుని, ఆలయాన్ని తమకు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళ వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరు వర్గాలు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని, డీఎస్పీతో చర్చించిన తర్వాత ఆలయం ఎవరికి చెందుతుందో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంత వరకు ఆలయంలోకి ఇరు వర్గాలు వెళ్లకూడదంటూ ఇరువర్గాల వారిని హెచ్చరించారు.