
లారీని ఢీకొన్న కారు
పెళ్లకూరు:లారీని కారు ఢీ కొనడంతో దంపతులకు స్వల్ప గాయాలైన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చైన్నె నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న కారు టెంకాయతోపు గ్రామం ప్‌లై ఓవర్ మీద ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటన లో కారులో ప్రయాణిస్తున్న అక్కగారిపేటకు చెందిన రవినాయుడు దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ మైఖేల్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
రైలు కింద పడి ఎస్‌ఐ దుర్మరణం
సైదాపురం: రైలు కింద పడి మండలానికి చెందిన ఎస్‌ఐ దుర్మరణం పాలు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనంతమడుగు గ్రామానికి చెందిన పడ్డాల పోలయ్య సీఐఎస్‌ఎఫ్ చైన్నె విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలయ్యకు భార్య రమాదేవితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. చదువుల నిమిత్తం ఆయన గూడూరులోనే కాపురం ఉంటున్నారు. సీఐఎఫ్‌ఎస్‌లో కానిస్టేబుల్‌గా చేరిన పోలయ్య ఇటీవలనే ఎస్‌ఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఆదివారం డ్యూటీ నిమిత్తం చైన్నెకు చేరుకున్నారు. ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో దిగి లోకల్ ట్రైన్‌లో సీఐఎస్‌ఎఫ్ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ రైలు దిగే సమయంలో రైలు కింద పడి దుర్మరణం చెందారు. దీంతో అక్కడే కేసును నమోదు చేసి సోమవారం సాయంత్రం చైన్నెకు చెందిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు పోలయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

లారీని ఢీకొన్న కారు