
కుమార్తె పెళ్లికి తెచ్చిన బంగారు ఆభరణాలు చోరీ
● వరుసగా రెండిళ్లలో చోరీ
చిల్లకూరు : పట్టణంలో శనివారం వేకువ జామున దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని గమ్మళ్లపాళెం, అశోక్‌నగర్ ప్రాంతాలలో రెండిళ్లలో చోరీకి పాల్పడి సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గూడూరు పట్టణ నడి బొడ్డున ఉన్న గమ్మళ్లపాళెంకు చెందిన పరుచూరి శివయ్య తన కుమార్తె వివాహం ఆగష్టులో నిర్ణయించుకోవడంతో ఇంటిలో ఉన్న సొమ్ముతో పాటుగా అప్పు చేసి సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలు చేయించి ఇంటిలోని బీరువాలో ఉంచాడు. తన కుమారుడు చైతన్యను ఇంటిలోనే ఉంచి నెల్లూరులో ఓ పని మీద కుటుంబ సభ్యులు అందరూ వేకువజామున వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనక బాగం నుంచి లోనికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. కుమార్తె పెళ్లికి తెచ్చి పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడంతో కుమార్తె పెళ్లి ఎలా చేయాలని శివయ్య కన్నీటి పర్యంతం కావడం అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. అలాగే సమీపంలోనే ఉన్న అశోక్ నగర్‌లోని శేషయ్య ఇంటిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శేషయ్య ప్రస్తుతం తన కుమార్తె హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఆమె వద్దకు వెళ్లడంతో ఇంటిలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంత మేర నగలు, డబ్బులు చోరీ జరిగిందనే విషయం ఆయన ఫిర్యాదు మేరకు పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా సంఘటనా స్థలంలో పరిశీలించిన అనంతరం క్లూస్ టీంకు సమాచారం ఇవ్వగా వారు వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేఖర్‌బాబు తెలిపారు.