
ప్రాణాలతో చెలగాటమా?
తిరుపతి మంగళం : ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సెంటర్ లైట్లను వెలిగించకుండా వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతారా? అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి కరకంబాడి మార్గంలో ప్రజలు, వాహనదారుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సెంటర్ లైట్లు ఏడాది కాలంగా వెలగడం లేదు. దీంతో వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నల్ల దుస్తులు ధరించి తిరుపతి–కరకంబాడి మార్గంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యుత్‌లైట్లు వీఐపీల కోసమా, ప్రజల కోసమా అంటూ నినదించారు. ప్రజలు, వాహనదారుల రక్షణ కోసం చేస్తున్న నిరసన కార్యక్రమంలో కొంతసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడినా సహకరించాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి వాహనదారులను అభ్యర్థించారు.
అధికారుల నిర్లక్ష్యం
ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు మంగళం పంచాయతీ, తిరుపతి నగర ప్రజలు నిత్యం ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారని తెలిపారు. దాంతో పాటు ఆ మార్గంలోని కళాశాలలకు వెళ్లి వచ్చే విద్యార్థులు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అయితే విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి ఏడాది కాలం అవుతున్నా వాటిని వెలిగించడంలో టీటీడీ, తుడా, విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు చిమ్మచీకటిలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు లెక్కలేదా? అని ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ దీపాలను వెలిగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అయితే నిరసన కార్యక్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడుతున్న అభినయ్‌రెడ్డితో పాటు పార్టీ శ్రేణులను పోలీసులు లాగి పక్కకు నెట్టేశారు. దాంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రోడ్డుపైన నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు

ప్రాణాలతో చెలగాటమా?

ప్రాణాలతో చెలగాటమా?