
జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలు
తిరుపతి సిటీ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర–2025 ప్రచారానికి మద్దతుగా ఎస్వీయూలో గురువారం నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. వారు బుధవారం ప్రత్యేక ప్రచార బ్రోచర్‌ను విడుదల చేశారు. వారు మట్లాడుతూ యోగా వల్ల మనిషిలో అంతర్గత సమతుల్యత, మానసిక దృఢత్వం, సమగ్ర శ్రేయస్సుకు కలుగుతాయన్నారు. ఆరోగ్యకరమైన, మేధోసమాజాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ మానసిక, శారీరక ఆరోగ్యం అవసరమని, సమాజంలో ఇటువంటి పద్ధతులను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే యోగా మాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఉదయం 8:20 నుంచి 9 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట యోగా సెషన్లు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రూసా సీఈవో వంశీ రాయల్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య టి.దామోదరం, పరీక్షల డీన్ ఆచార్య ఎస్.కిషోర్, అసిస్టెంట్ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ హరికృష్ణ యాదవ్, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.వివేక్ పాల్గొన్నారు.
ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్
యోగాంధ్ర–2025 ప్రచార
బ్రోచర్ ఆవిష్కరణ