
రెచ్చిపోతున్న ఇసుకాసురులు
రాజుపాళెం, తెలుగురాయపురంలో అక్రమ రీచ్‌లు
నిత్యం తరలిపోతున్న 3,200 మెట్రిక్ టన్నులు
పర్యావరణానికి యథేచ్ఛగా తూట్లు
పట్టించుకోని అధికారులు
వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా పెన్నా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో సై‘ఖతం’ చేసేస్తున్నారు. వందలాది వాహనాల్లో పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అక్రమార్కులను నిలువరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి మాత్రం ముడుపులు తీసుకుని అక్రమ రీచ్‌లను ప్రోత్సహిస్తున్నారు. రాత్రింబవళ్లు ఇసుకను దోచేస్తున్నప్పటికీ కాసుల కోసం పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
వాటా ఇచ్చి తరలింపు
రాజాపాళెం, తెలుగురాయపురంలోని అక్రమ రీచ్‌ల నుంచి ఇసుక తరలించేందుకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి యూనిట్‌కు రూ.వెయ్యి చొప్పున వాటాను ఇసుకాసురులు ముట్టజెపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం సగటు న వంద వాహనాల్లో ఇసుక తరలిపోతున్నట్లు సమాచారం. ప్రతి వాహనానికి రూ. 8 యూనిట్లు లెక్కన నిత్యం 800 యూనిట్ల ఇసుకను ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అండతో ఇసుక మాఫియా బరితెగించి రాత్రి పగలు తేడాలేకుండా తవ్వకాలు సాగిస్తోంది. భారీ వాహనాల్లో ఇసుక వెళ్లిపోతోంది. ఆయా మార్గాల్లో నివసించేవారికి ఈ వాహనాల రణగొని ధ్వనులతో నిద్ర కరువవుతోంది. ఇళ్లు దుమ్మకొట్టుకుపోతున్నాయి. రహదారులు సైతం ఛిద్రమవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమర్జనలో భాగస్వాములైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సరికొత్త దారిలో..
ఇసుక మాఫియా రోజుకో మార్గం ఎంచుకుని అక్రమ రవాణా సాగిస్తోంది. రాజుపాళెం, తెలుగురాయపురం మీదుగా కాకుండా ఇప్పుడు తాజాగా వెంకటరెడ్డిపల్లె వంతెన సమీపంలోని అటవీ ప్రాంతం గుండా ఇసుకను రవాణా చేస్తోంది. ఇందుకోసం స్థానిక రైతుకు కొంత నగదు ఇచ్చి ఆయన పొలంలో బాట వేసుకుంది. ఈకొత్త రూట్ ద్వారా రాత్రి పూటహైవే మీదుగా భారీ వాహనాల్లో ఇసుకను తరలించేస్తోంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక తోడేళ్లు పేట్రేగిపోతున్నాయి. టీడీపీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో దందా సాగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.కోట్ల విలువైన ఇసుకను యథేచ్ఛగా దోచుకున్నాయి. కలువాయి మండలం రాజుపాళెం, తెలుగురాయపురం సమీపంలోని పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఉండాలి. అయితే ఎన్‌జీటీ అనుమతి లేకుండానే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇసుక రేవుల్లో పడి దోచేస్తున్నారు.
స్పందించని అధికార యంత్రాంగం
పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి ఇసుకాసురులు దారి వేసుకున్నారు. నదీ గర్భంలోకి రోడ్డు వేసినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఇటీవల దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రహదారిని మూసివేసినట్లుగా హడావుడిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులుదులిపేసుకున్నారు. అయితే గంటల వ్యవధిలోనే ఆ ఫ్లెక్సీల వించివేసి ఇసుకాసురులు వాహనాల రాకపోకలను ప్రారంభించేశారు. టీడీపీ నేతల సహకారంతో అక్రమార్కులు ఇసుక దోపిడీ చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైవేలోకి వస్తున్న ఇసుక టిప్పర్లు