
● తమిళనాడు యువకుడు మృతి
చంద్రగిరి : సర్వీసు రోడ్డుపై ఆగి ఉన్న లారీను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి రాయలపురం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడులోని కాడ్పాడికి చెందిన ప్రసన్న(26) వ్యక్తిగత పనుల నిమిత్తం తన బుల్లెట్ వాహనంపై తిరుపతికి పయనమయ్యాడు. రాయలపురం సమీపంలో వస్తున్న క్రమంలో దాబా వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న మృత్యువాత పడ్డాడు. వెంటనే తేరుకున్న లారీ డ్రైవరు లారీతో సహా అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యంగానే ప్రమాదాలు
జాతీయ రహదారిపై ఉన్న దాబాల వద్ద అనధికారికంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వలనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను నిలువరించేందుక సరైన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ దాబాల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీను ఢీకొనడం ద్వారా ఇద్దరు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. రహదారికి ఆనుకుని ఉన్న దాబాల యజమానులు ప్రతి నెలా పోలీసు శాఖలోని కొంత మందికి మామూళ్లు అందించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.