విజయవంతంగా 5కే రన్
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ సౌత్ క్యాంపస్‌లో ఆదివారం విజయవంతంగా 5కే రన్ నిర్వహించారు. ఐఐటీ విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎన్‌ఎన్ మూర్తి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో సంపూర్ణ ఆరోగ్యానికి మించిన అపార సంపద లేదని తెలిపారు. ఆహారం, పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. నాణ్యమైన సమతుల ఆహారం తీసుకుంటూ, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించాలని కోరారు. ఈ క్రమంలో 5కే రన్ పూర్తి చేసిన మొదటి ఐదుగురికి నగదు బహుమతులు అందించారు. 6 నుంచి 25 స్థానాల్లో నిలిచిన వారికి పతకాలు పంపిణీ చేశారు. రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌లు అందజేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అడ్వైజర్ ఉదయకుమార్ సుకుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యప్పన్, పీటీఐ శ్రీధర్ పాల్గొన్నారు.


