
నిమ్మజనానికి తరలుతున్న పోలేరమ్మ
ముగిసిన ముత్యాలమ్మ జాతర
అట్టహాసంగా పోలేరమ్మ నిమ్మజ్జనం
చిల్లకూరు: ఏడాదికి ఒకసారి వచ్చే పోలేరమ్మ తన అక్క ముత్యాలమ్మకు వెళ్లి వస్తానని పలకరించే సన్నివేశాన్ని గణాచారి రక్తికట్టించారు. ఈ ఘట్టాన్ని భక్తులు తన్మయత్వంతో తిలకించి పులకించిపోయారు. ఈ సందర్భంగా అక్కా పోయి వస్తానే..! అంటూ పోలేరమ్మ అంటుండగా.. వచ్చే ఏడాది మళ్లీరా చెల్లీ..! అని ముత్యాలమ్మ పలికినట్లు గణాచారి చెప్పడంతో అక్కడున్న భక్తులు పొలి కేకలు పెట్టి పోలేరమ్మ తల్లికి జై.. అంటూ నినాదాలు చేశారు.
గుడి వెనుక ఉన్న ద్వారంలో నుంచి పోలేరమ్మను ముత్యాలమ్మ ఆలయానికి కొంత దూరంలో ఉన్న జీడిమామిడి చెట్టు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. దీంతో ముత్యాలమ్మ జాతర శుక్రవారం అట్టహాసంగా ముగిసింది. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. పోలేరమ్మకు మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున అమ్మవారికి ఏడు కుండల్లో వండిన అన్నం కుంభం పోశారు. అలాగే గణాచారికి ఊయలు సేవ నిర్వహించారు. గ్రామంలోని పెద్దలు అక్కడ పోలేరమ్మ కథను ఆసాదుల ద్వారా వినిపించారు. తర్వాత పొలి అన్నం గ్రామ శివారు ప్రాంతాలలో చల్లారు. చివరగా అమ్మవారి గుడి వద్దకు రాగానే పోలేరుతల్లి.. కరుణించుమ్మా.. జైపోలేరు..! అంటూ కేకలు వేస్తుండగా అమ్మవారి విగ్రహాన్ని తలపై మోసుకుంటూ గ్రామంలో ఊరేగింపుగా బయలు దేరారు.
గణాచారి ముందు నడుస్తుండగా..
గంగమిట్ట మీద నుంచి పోలేరమ్మ తల్లిని నిమ్మజనం చేసేందుకు తీసుకెళ్తుండగా గణాచారి నుంచి అనుమతి తీసుకున్నారు. పోలేరమ్మ నిమ్మజ్జనానికి వెళ్లే మార్గంలో మహిళలు సంతానం కోసం వరపడ్డారు. వారిపై నుంచి గణాచారి నడిచి వెళ్లారు.
జాతర ఆదాయం రూ.59.22 లక్షలు
తూర్పుకనుపూరులో నాలుగు రోజులుగా నిర్వహించిన ముత్యాలమ్మ జాతరలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.39,87,837 ఆదాయం వచ్చినట్టు ఈవో నవీన్‌కుమార్ తెలిపారు. ఆలయంలో శుక్రవారం హుండీలోని కానుకలు, టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. టికెట్ల ద్వారా రూ.11,05,000, హుండీల ద్వారా రూ.28,82,837, అలాగే భక్తులు సమర్పించిన 235 దున్నపోతులను వేలం వేయగా రూ.19.35 లక్షలు వచ్చినట్టు వెల్లడించారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసబాబు, దినేష్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

కానుకలను లెక్కిస్తున్న బ్యాంకు సిబ్బంది