
స్వామివారి సేవలో ఈఓ ధర్మారెడ్డి
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం అర్జీలు రాసేందుకు ప్రత్యేకంగా ముగ్గురు వీఆర్‌ఓలను ఏర్పాటు చేశామన్నారు. స్పందనకు అన్నిశాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 68,769 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.33 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది.
ఇన్‌చార్జి జేసీగా పెంచలకిషోర్
తిరుపతి అర్బన్ : ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్‌గా డీఆర్‌ఓ పెంచల కిషోర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్క డ పనిచేస్తున్న జేసీ బాలాజీని విజయవాడకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన ఆదివారం తన బాధ్యతలను పెంచలకిషోర్‌కు అప్పగించి రిలీవ్ అయ్యారు.
బేడి ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వెలసిన శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఆదివారం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ఏటా ప్రత్యేక అభిషేకం జరిపించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, వీజీఓ నంద కిషోర్, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు.
బాధ్యతగా
మానవహక్కుల రక్షణ
తిరుపతి సిటీ : శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ లా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథి వీసీ భారతి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. గుంటూరు ఒకటవ అదనపు జిల్లా న్యాయాధికారి సీహెచ్ రాజ గోపాలరావు జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విచారణ, కస్టడీ, న్యాయ సమీక్ష, మానవ హక్కులు, ఉల్లంఘనపై అవగాహన కల్పించారు. డాక్టర్ సీతా కుమారి మాట్లాడుతూ మానవ హక్కుల రక్షణకు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఎన్.రజనీ, డీన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్–హ్యుమానిటీస్ ప్రొఫెసర్ కె.అనురాధ, యస్.మాధురీ పరదేశి, ప్రొఫెసర్ సునీతా కాణిపాకం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.
