ద్విచక్రవాహనం దూసుకుపోవడంతో మహిళ మృతి
ఖమ్మం జిల్లా: రహదారిపై ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో తప్పించబోయి లారీకిందికి దూసుకుపోయింది. తీవ్రగాయాలతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ రోడ్డుకు చెందిన మోరంపూడి స్వర్ణలత (55) ద్విచక్రవాహనం(స్కూటీ)పై గంగారం వైపు నుంచి సత్తుపల్లికి వస్తోంది.
తాళ్లమడ శివారున కుక్కలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ధాన్యం కోసం ఆగి ఉన్న లారీ కిందకు దూసుకుపోయింది. లారీకింద భాగంలో ఇరుక్కుపోయిన స్వర్ణలత తలకు బంపర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను సత్తుపల్లి 108 సిబ్బంది బయటకు తీశారు. మృతురాలికి భర్త రామకోటేశ్వరరావు, కుమారుడు నాగశ్యామ్, కుమార్తె నాగశ్రీ ఉన్నారు.


