
లారీ ఢీకొని మృతిచెందిన దంపతులు
ఎర్రుపాలెం మండలంలో ప్రమాదం
ఎర్రుపాలెం/కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజల తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వచ్చి ఆనందంతో తిరిగి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. కుమార్తె వివాహం తమ గ్రామానికే చెందిన సాయితో జరిపించారు.
ఇక బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్‌కు ఇటీవల వివాహం కుదిరింది. కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న ఓ పూజారి వద్దకు వచ్చి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆపై బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎర్రుపాలెం – తక్కెళ్లపాడు మధ్య ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతుల తలలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. కాగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ గని ఆత్కూరులో శ్రీనివాసరావు, కుమారి మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.